ప్రమాదం పొంచి ఉన్నదని..బస్టాప్‌ తరలించారు

హైదరాబాద్‌ : బయోడైవర్సిటీ ప్లైఓవర్‌ నుంచి కారు పల్టీలు కొడుతూ ఎగిరి పడటంతో బస్సు కోసం ఎదురుచూస్తున్న సత్యవేణి మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. కారు పడిన చోట బస్టాప్‌తో పాటు ఆటో స్టాంట్‌ ఉంది. ప్లైఓవర్‌ పై నుంచి పడిన కారు రోడ్డుపై పడి ఢీకొట్టడంతో చెట్టు విరిగిపోగా మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీసులు బయోడైవర్సిటీ జంక్షణ్‌లో మాదాపూర్‌కు వెళ్లేందుకు నిస్సాన్‌ షోరూం ముందు ఉన్న బస్టాప్‌, ఆటో స్టాండ్‌ను అక్కడి నుంచి తరలించారు. ఈ జంక్షన్‌ నుంచి దాదాపు 200 మీటర్ల పొడవు బస్సులు, ఆటోలతో పాటు క్యాబ్‌లు ప్రయాణికుల కోసం ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదానికి ముందు ప్రయాణికులు, వాహనాలు ఆగడంతో రద్దీగా ఉండే చోటు నేడు ఖాళీగా మారింది. ఇదే నెల మొదటి వారంలో అర్ధరాత్రి కారు ఢీకొని ఇద్దరు యువకులు ఎగిరి నిసాన్‌ షోరూమ్‌ ముందున్న బస్టాప్‌ సమీపంలోనే పడి అక్కడిక్కడే మృతి చెందారు. గత శనివారం ప్లైఓవర్‌ పై నుంచి దూసుకొచ్చిన కారు కూడా అదే ప్రాంతంలో పడింది. బస్టాప్‌తో పాటు ఆటో స్టాండ్‌ ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనని ఆలోచించిన ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

Post a Comment

0 Comments