చర్చలు నై..!ప్రైవేటీకరణకు సై..!!

ఆర్‌టిసీ సమ్మె వ్యవహారంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పలు అంశాలతో రూపొందించిన నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సమర్పించింది. అంశాలలో ముందుగా రూట్ల ప్రైవేటీకరణపై జరిగిన మంత్రి వర్గ తీర్మానాన్ని ప్రభుత్వం హైకోర్టుకు అందజేసింది.న్యాయస్థానం సూచన మేరకు రూ.47 కోట్లు చెల్లించినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాబోవని ప్రభుత్వం తెలిపింది. నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లు చెల్లించాలన్న హైకోర్టు సూచనను పరిశీలించి ఆధ్యయనం చేస్తే రూ.2,209 కోట్ల దాక తప్పనిసరి చెల్లింపులు, రుణాలు, నష్టాలు ఉన్నాయని రూ.47 కోట్లు ఏమూలకూ సరిపోవని ప్రభుత్వం నివేదికలో వివరించింది. మరో వైపు విలీనంపై కార్మికులు మొండిపట్టుతో వ్యవహరిస్తే చర్చలు సాధ్యం కావని నివేదికలో స్పష్టం చేసింది. సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే అధికార పరిధి హైకోర్టుకు ఎలా ఉందో వివరించాలని పిటిషనర్‌ తరపు న్యాయవాదిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. విద్యా సంస్థలకు సెలవులు పొడిగించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసినట్లు ఈ సందర్భంగా హైకోర్టు ప్రకటించింది.
       ఎస్మా చట్టం ప్రకారం ఆర్‌టిసి సమ్మె చట్టవిరుద్ధమని పిటిషనర్‌ తరపు న్యాయవాది పీవి కృష్ణయ్య హైకోర్టుకు తెలిపారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం స్పందిస్తూ ఎస్మా చట్టం ప్రకారం ఆర్‌టిసిని తప్పనిసరి సర్వీస్‌గా పేర్కొంటూ జారీ చేసిన జీవో చూపాలని ఆదేశించింది. ఆర్‌టిసిని ప్రజాప్రయోజన సేవ(పబ్లిక్‌ యుటిలిటీ సర్వీస్‌)గా ప్రకటించినందున ఎస్మా పరిధిలోకి వస్తుందని కృష్ణయ్య వాదించగా.. ప్రజా ప్రయోజన సేవలన్నీ అత్యవసర సర్వీసులు కావని హైకోర్టు వ్యాఖ్యనించింది. ఆర్‌టిసిని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో ఇస్తేనే అత్యవసర సర్వీసుగా ఉంటుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

Post a Comment

0 Comments