Monday, November 25, 2019

అటు చేరమని..ఇటు కుదరదని..!

ఆర్‌టిసి కార్మికుల సమ్మె విరమణ


తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్‌టిసి కార్మికులు 52 రోజుల పాటు చేపట్టిన సమ్మె సోమవారం విరమించారు. ఈ మేరకు కార్మిక సంఘాల జెఎసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఈయూ కార్యాలయంలో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు కార్మికులంతా డిపోల వద్దకు చేరుకుని విధుల్లోకి చేరేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తాము సమ్మె విరమించినందున తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దశల వారీగా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్మిక న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్‌టిసి ప్రైవేటు పరం చేయకుండా అడ్డుకుంటామన్నారు. ఇన్ని రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో కార్మికులు ఓడిపోలేదని, ప్రభుత్వం గెలవలేదని వ్యాఖ్యానించారు. తమ పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని.. సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. మొదటి షిఫ్ట్‌ కార్మికులతో పాటు రెండో షిఫ్ట్‌ కార్మికులు కూడా రేపు ఉదయం డిపోల వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు. 
ఇప్పుడు చేరతామంటే కుదరదు: ఆర్‌టిసి ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ 
సమ్మె విషయంలో ఆర్‌టిసి కార్మిక సంఘాల జెఎసి నేతల ప్రకటన హాస్యాస్పదమని ఆర్‌టిసి ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌శర్మ అన్నారు. ఇష్టమొచ్చినప్పుడు గైర్హాజరై..ఇప్పుడు చేరతామంటే కుదరదని ఆయన వ్యాఖ్యానించారు. ఇష్టానుసారం చేస్తామంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో సాధ్యం కాదని చెప్పారు.సమ్మె విరమిస్తున్నట్లు ఆర్‌టిసి కార్మిక సంఘాల జెఎసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించిన నేపథ్యంలో సునీల్‌శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు సునీల్‌శర్మ ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకటన వెలువడటం గమనార్హం.
తాత్కాలిక సిబ్బందిని అడ్డుకుంటే చర్యలు..
''హైకోర్టు చెప్పిన ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో  ఉన్న కార్మికులను విధుల్లో చేర్చుకోవడం సాధ్యం కాదని సునీల్‌శర్మ స్పష్టం చేశారు. తమంతట తాముగా  సమ్మెకు దిగి, ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరడం చట్ట ప్రకారం కుదరదన్నారు. కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారన్నారు. రేపు డిపోల వద్దకు వెళ్లి శాంతి భద్రతల సమస్యలు సృష్టించవద్దన్నారు. బస్సులు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డగించవద్దని కోరారు. అన్ని డిపోల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి , పరిస్థితిని సమీక్షించడం జరుగుతుందన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వంగానీ, ఆర్‌టిసి యాజమాన్యం గానీ క్షమించబోదని హెచ్చరించారు.   

No comments:

Post a Comment