అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్ధార్‌ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాడో ఓ రైతు.  ఆ కేసులో నిందితుడైన సురేష్‌ కుటుంబానికి బాలాపూర్‌ మండలం, గుర్రంగూడకు చెందిన రైతు జక్కిడి ముత్యంరెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందించాడు. ముత్యంరెడ్డి కొంతకాలం క్రిందట అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం, తుర్కయాంజాల్‌ పరిధిలోని 110 నుంచి 115 సర్వే నెంబర్‌లలో గడ్డం లక్ష్మారెడ్డి వద్ద 1.09 ఎకరాలు, బొక్క కృష్ణ ప్రియ వద్ద 0.20 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. సెప్టెంబర్‌ 3న మ్యుటేషన్‌ కోసం తహశీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని వీఆర్‌ఓ శంకర్‌ను కలిశాడు.
మ్యుటేషన్‌ కోసం వీఆర్‌ఓ లక్ష రూపాయలు డిమాండ్‌ చేయగా రూ.70 వేలు ఇస్తానని ముత్యంరెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. డిజిటల్‌ సంతకం అయిన తర్వాత వీఆర్‌ఓ లంచం డిమాండ్‌ చేయడంతో ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అక్టోబర్‌ 3వ తేదీన వీఆర్‌ఓ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 16వ తేదీన సదరు సర్వే నెంబర్‌లో భూమి మిస్‌ మ్యాచ్‌ అవుతుందని ముత్యంరెడ్డికి రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. అదే నెల 26న ముత్యంరెడ్డి భూమికి సంబంధించిన మ్యుటేషన్‌ పనిని అధికారులు క్లియర్‌ చేసినట్లు తెలిసింది. లక్ష రూపాయల్లో ఉన్నతాధికారికి వాటా ఉంటుందని వీఆర్‌ఓ శంకర్‌ చెప్పినట్లు ముత్యంరెడ్డి పేర్కొన్నాడు. ఏసీబీకి వీఆర్‌ఓ పట్టుబడటంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ తమశీల్ధార్‌ విజయారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post