Wednesday, November 27, 2019

కడుపు మాడుతుండే...కన్నీరు ఆగనందే..!!

ఆర్‌టిసి మహిళా ఉద్యోగుల వేదన..


ఆర్‌టిసి కార్మికుల బాధలు వర్ణాతీతం. ఉద్యోగాల్లో చేరేందుకు తెల్లవారుజామునే డిపోల వద్దకు చేరి దీనంగా నుంచుంటున్నారు. కళ్ల వెంట కన్నీరు కార్చుకుంటూ వారి జీవితాల్లో కమ్మిన చీకటిని తూడ్చువేసుకునేందుకు నానా యాతన పడుతున్నారు. సుదీర్ఘ సమ్మె అనంతరం విధుల్లోకి చేరేందుకు కార్మికులు చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. కార్మిక సంఘాల జేఏసీ నేతల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం డిపోల వద్దకు చేరితే వారికి చేదు అనుభవమే ఎదురైంది. తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ అంగీకార పత్రాలిచ్చినా  అధికారులు అంగీకరించడం లేదు. తమను కొలువులోకి అనుమతించాలని మహిళా కార్మికులు అధికారులను వేడుకోవడం..కంట నీరు పెట్టుకోవడం పలువురిని కలిచివేస్తోంది. రాష్ట్రంలోని ఉన్న అన్ని జిల్లాల్లో ఆయా డిపోల వద్ద కార్మికులను పోలీసులు తీవ్రంగా అడ్డుకొని అరెస్టులు చేశారు. మంగళవారం ఉదయం షిప్టు సమయానికి కార్మికులు డిపోల వద్దకు చేరుకోగా  లోపలకు ప్రయత్నించేందుకు వీల్లేకుండా  కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. వారి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో తోపులాటలు జరిగాయి. విధుల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికులను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. కొన్ని జిల్లాల్లో  సోమవారం రాత్రి నుంచి కార్మిక నేతలను ముందుస్తు అరెస్టులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌టిసి మంగళవారం 6475 బస్సులను నడిపినట్లు పేర్కొంది. ఇందులో ఆర్‌టిసి బస్సులు 4,580 కాగా ప్రైవేటు బస్సులు 1895 ఉన్నాయని సంస్థ వెల్లడించింది.
పలు డిపోల్లో 2449 మంది అరెస్టు..
హైదరాబాద్‌లోని పలు డిపోల వద్ద మూడెంచెల బందోబస్తును ఏర్పాటు చేశారు. విధుల్లో చేరేందుకు వచ్చిన వారిని వచ్చినట్లే వాహనాల్లోకి నెట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో హైదరాబాద్‌, సైబరాబాద్‌,రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2449 మందిని అరెస్టు చేసినట్టు ఆయా పోలీసు కమీషనరేట్లు ప్రకటించాయి. వేకువజామునే డిపోలవకు వెళ్తే తాము లోపలకు వెళ్లవచ్చునేమో అని కార్మికులు భావించారు. వీరికంటే ముందే అక్కడ బారికేడ్లు, ముళ్ల కంచెలతో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు. ఆర్‌టిసి తాత్కాలిక సిబ్బందికి పోలీసులు రక్షణగా నిలిచి బస్సులను భద్రంగా పంపారు. ఆర్‌టిసి డిపో మేనేజర్ల నుంచి అనుమతి ఉన్నట్టు చిట్టీలు చూపిస్తేనే తాత్కాలిక సిబ్బందిని డిపోలకు అనుమతించారు. 
తొలి రోజు కన్నీరే మొదలైంది..
రాష్ట్రంలో డిపోల వద్ద తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ కార్మికులు కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేస్తున్న సమయంలో మహిళా కార్మికులు రోదిస్తూ కాళ్ళావేళ్లా పడ్డారు. వరంగల్‌ రీజియన్‌ ప్రాంతంలోని 9 డిపోల వద్దకు ఆర్‌టిసి కార్మికులు చేరుకోగా వారిని పోలీసులు నిలువరించారు. వరంగల్‌, హన్మకొండ నగరాల్లోని మూడు డిపోల ఎదుట కార్మికులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో కొందరు మహిళా కండక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేయగా మరికొందరు కంట తడిపెట్టారు. నిజామాబాద్‌ ఆర్‌టిసి డిపో వద్దకు విదుల్లో చేరేందుకు ఆర్‌టిసి కార్మికులు డిపో మేనేజర్‌ ఆనంద్‌కు వినతి పత్రాలు ఇవ్వబోగా ఆయన తిరస్కరించారు. కొందరు కార్మికులు అధికారి కాళ్లు మొక్కారు. రోదిస్తూ వేడుకున్నారు. ఖమ్మం ఆర్‌టిసి రీజియన్‌ పరిధిలోని ఆరు డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిపోల వద్దకు వచ్చిన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. నాగర్‌కర్నూల్‌లో పోలీసులకు కార్మికుల మధ్య తోపులాట జరిగింది. మంచిర్యాలలో కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడంతో కార్మికుడికి చాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. విధుల్లోకి తీసుకోవాలని కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌ డిపోల వద్ద మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. 


No comments:

Post a Comment