ఆర్‌టిసి ఉద్యోగులు తమను విధుల్లోకి తీసుకోవాలని రెండో రోజైన బుధవారం కూడా డిపోల వద్ద తెల్లవారుజాము నుండే పడిగాపులు కాచారు. కానీ వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో తీవ్ర మనస్థాపం  చెందిన సూర్యాపేట డిపోకు చెందిన  ఓ కండక్టర్‌ ఈ రాష్ట్రంపైనా, తాను చేసే ఉద్యోగంపైనా పూర్తి వివరాలతో వివరిస్తూ సిఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాశారు. అందులో ఇలా ఉంది..
''గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్‌ గార్కి..
 తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్న ఆత్మగౌరవంతో బ్రతుకుదాం అనుకున్నా..కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా..కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా..నాయనా..అనే విధంగా తీవ్ర మానసిక వేదనకు గురై నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను..
మీకు మాట తప్పడం, మాయమాటలు చెప్పి మోసం చెయ్యడం తెలుసు అని మా కార్మికలోకం లేట్‌గా తెలుసుకుంది. మీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు..నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను.దానికి కారణం లేకపోలేదు సార్‌. మా తెలంగాణలో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్‌ సర్‌ ఉన్నారు. ఆంధ్ర పాలకులు నిజంగా మోసం చేశారేమో, మనల్ని బాగా చూసుకుంటారు అనుకున్న. కానీ సర్‌ మా 30 మంది కార్మికులు చనిపోతేనే మీరు స్పందించలేదు చూడండి సర్‌ అప్పుడు అనిపించింది సర్‌ తెలంగాణ మా కోసం కాదు..తెలంగాణ కేవలం మీ లాంటి నాయకులు కోసమే అని.. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారు అని కలలో కూడా ఊహించలేదు. సర్‌ కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యం అయింది సర్‌. నా చెల్లెలు ఏడుస్తుంటే తట్టుకోలేక పోతున్న సర్‌ కానీ ఒక్కటి మాత్రం నిజం సర్‌. నా ఆర్‌టిసి అక్క చెల్లెల ఉసురు కచ్చితంగా మీకు తగులుతుంది సర్‌, నేను సూర్యాపేట  డిపోలో ఆర్‌టిసి కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మీలాంటి ఒక మోసకారి ఒక మాటకారి ఒక మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మాభిమాన్ని చంపుకొని రాజీనామా చేస్తున్న. నా పేరు యల్‌.కృష్ణ నా స్టాప్‌ నెంబర్‌ 176822. సూర్యాపేట డిపో సర్‌. నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. మీ సంస్థ నుండి నాకు రావాల్సిన బకాయిలను ఇప్పించి నా రాజీనామా ఆమోదించగలరని నా యొక్క మనవి. ఆయ్యా సీఎం సార్‌ మీరు ఉద్యమ నాయకుడిగా  ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి. పాపం సర్‌ ఆర్‌టిసి వాళ్లు మిమ్మల్ని అభిమానించారు సర్‌ కానీ మీరు ఇలా చేస్తారు అని కలలో కూడా అనుకోలేదు. పాపం ఆర్‌టిసి వాళ్లకు వచ్చే 15000 జీతం తీసుకొని ఫ్యామిలీ చూసుకుంటూ చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు సర్‌. మీరు వాళ్లకు ఏమి ఇవ్వకున్నా కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీ మీద గౌరవంతో ప్రాణాలు ఇచ్చేవారు సర్‌. 
  కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను. మా తల్లిదండ్రులు సర్‌ కనీసం వాళ్లను అయినా సంతోషంగా ఉండేటట్లు నెల నెలా వాళ్లకి వృద్దాప్యం పింఛన్‌ ఇవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీకు మా కేసీఆర్‌  అని ఓటు వేశారు సర్‌. వాళ్లు బాధపడుతుంటే  సమాజంలో ప్రతి ఒక్కరూ చిన్న చూపు చూస్తుంటే ప్రతి ఒక్కరూ నన్ను దీనంగా చూస్తుంటే తట్టుకోలేక పోయాను సర్‌. ప్రతి రోజు అరెస్టులు ఏంది? ఈ లాఠీ దెబ్బలు  ఏంది?  నా ఆర్‌టిసి సోదరులు ఏమి తప్పు చేశారు అని ఇంకా ఎంత మంది ని ఆత్మహత్యలు చేసుకునేట్టు చేస్తారు. అందుకే ఇవ్వన్నీ భరించలేకనే నా ఆత్మభిమానాన్ని  చంపుకొని ఉద్యోగం చేయలేను. అందుకే నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాను. మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని. నీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను. కాబట్టి తక్షణమే  నా తల్లిదండ్రులకు వృద్ధాప్యం పింఛను ఒక్కటి ఇవ్వండి. పేరు మీద అ సెంటు  భూమి లేదు కాబట్టి మూడు ఎకరాల పొలం అలాగే నా పిల్లలకి ప్రభుత్వస్కూల్లో చదువు, నాకు ఉండటానికి ఇల్లు లేదు కనుక డబుల్‌బెడ్‌ రూం ఇల్లు ఇవ్వండి. ఒక వేళ మీరు ఏమీ ఇవ్వకున్నా సమజాంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగే నా ఉద్యోగ రాజీనామాను తక్షణమే ఆమోదించగలరు. 
ఇట్లు
ఎల్‌. కృష్ణ
స్టాఫ్‌ నెంబర్‌ 176822
ఆర్‌టిసి కండక్టర్‌, సూర్యాపేట డిపో.


Post a Comment

Previous Post Next Post