Sunday, November 24, 2019

ఇక 'పాలేరు' మత్స్యకార జీవితాల్లో వెలుగు

రిజర్వాయర్‌లో రొయ్యల పిల్లలను విడుదల చేసిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
తెలంగాణ వచ్చాక సిఎం కేసీఆర్‌ చేపడుతున్న కులవృత్తుల అభివృద్ధిలో భాగంగా మత్స్యకారులకు అన్ని రకాలుగా ప్రయోజనం జరిగిందని, అదే విధంగా పాలేరు రిజర్వాయర్‌ ఆధ్వర్యంలో కూడా మత్స్యకార జీవితాల్లో వెలుగు నింపారని రాష్ట్ర పశుసంవర్థక , మత్స్య, పాల అభివృద్ధి సంస్థ, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఆదివారం పాలేరు రిజర్వాయర్‌లో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు రవాణా శాఖా మంత్రి పువ్వాడ్‌ అజయ్‌కుమార్‌,పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ కలిసి రొయ్యల పిల్లలను విడుదల చేశారు.
 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో  మత్స్యకారులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ రకాలుగా 100 శాతం సబ్సిడీ అందించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలతో వారికి మేలు చేకూరుతుందన్నారు. వారికి కావాల్సిన మోపెడ్‌లు, వలలు, వాహనాలు, చేప పిల్లలు, ఐస్‌ బాక్సులు ఇచ్చామన్నారు.
ఖమ్మం జిల్లాలో 707 చెరువులలో  రూ.2.50 కోట్ల ఖర్చుతో 318 లక్షల చేప పిల్లలు 100 శాతం రాయితీతో ఇచ్చామన్నారు. ఈ ఏడాది జిల్లాలో రూ.31 కోట్ల ఖర్చులో వివిధ రకాల అవకాశాలను కల్పించామన్నారు. పాలేరు రిజర్వాయర్‌ మంచినీటి చేపల పెంపకంలో రాష్ట్రంలోనే అగ్రగ్రామిగా నిలుస్తుందన్నారు. ఇక్కడ 1300 మంది మత్స్యకారులు 18 గ్రామాల నుండి పాలేరు రిజర్వాయర్‌లో చేపల వేటపై ఆధారపడుతున్నారన్నారు. 
అనంతరం మంత్రి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ పాలేరు రిజర్వాయర్‌ వ్యవసాయ రంగానికి కాకుండా మత్స్యకారుల అభివృద్ధి కోసం పాటుపడుతుందన్నారు. భవిష్యత్తులో గోదావరి జలాలను ఈ రిజర్వాయర్‌కు తరలిస్తామన్నారు. సాగు, తాగు నీరుతో పాటు చేప పిల్లలను ఉచితంగా అందజేస్తూ మత్స్యకారుల కుటుంబాల్లో సీఎం కేసీఆర్‌ వెలుగులు నింపారన్నారు. 

No comments:

Post a Comment