Thursday, November 21, 2019

గులాబీ'బంతి'ప్రత్యేకతేంటి?

గులాబీ..గులాబీ...ఇప్పుడు ఇండియా క్రికెట్‌ వర్గాల్లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. వన్డేలు, టీ20లంటే తెలుపు బంతి, టెస్టులంటే ఎరువు బంతి, ఎన్నో ఏళ్లుగా అలవాటైపోయిన విషయమిది. కానీ ఇప్పుడు భారత్‌ ఆడబోయే తొలిడేనైట్‌ టెస్టులో గులాబి బంతి వినియోగిస్తారనే సరికి ఆ రంగు బంతినే ఎందుకు ఆడుతున్నారనే  ప్రశ్న ప్రతి ఒక్క అభిమానిలో ఉత్పన్నమవుతోంది. ఆటగాళ్లు దానికి ఎలా అలవాటు పడతారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలీ గులాబీ బంతిని ఎలా తయారు చేస్తారు? దీని అసలు కథ ఏమిటో తెలుసుకుందాం!

ఇండియాలో ఆడే టెస్టు మ్యాచ్‌లకు ఎన్‌జి సంస్థ బంతులనే ఉపయోగిస్తారన్న సంగతి మనందరికీ తెలుసు. విదేశాల్లో ఎక్కువుగా కూకాబుర్రా బంతులు వాడుతుంటారు. వాటిని పూర్తిగా యంత్రాలతో తయారు చేస్తారు. కానీ ఎన్‌జి బంతులకు అక్కడక్కడా కొద్దిగానే యంత్రాల వినియోగం ఉంటుంది. కార్క్‌, ఉన్ని కలిసిన మిశ్రమంతో బంతి లోపలి భాగాన్ని తయారు చేస్తారు. తోలు కత్తిరించడం, బంతిని దారంతో కుట్టడం అన్నీ మనుషులే చేస్తారు. సీమ్‌ దారాన్ని చేత్తో కుట్టడం వల్ల స్పిన్నర్లకు బంతి మీద బాగా పట్టు చిక్కి తిప్పడానికి, బౌన్స్‌ రాబట్టడానికి అవకాశముంటుంది. అంతేకాక సీమ్‌ ఎక్కువు (50 ఓవర్లు)సమయం నిలిచి ఉంటుంది.
గులాబీ సీమ్‌లో రహస్యమేమిటి?
ఎరుపు బంతితో పోలిస్తే గులాబీలో సీమ్‌ పరంగా వైవిధ్యం ఉంటుంది. ఎరుపు బంతిలో పూర్తిగా సింథటిక్‌ దారాన్ని వాడతారు. గులాభీలో సింథటిక్‌తో పాటు లినెన్‌ దారం ఉపయోగిస్తారు. ఇందుకు కారణం ఉంది. ఎరుపు బంతితో పగటిపూట మాత్రమే  ఆట సాగుతుంది. కాబట్టి సింథటిక్‌ దారంతో ఏ ఇబ్బందీ ఉండదు. కానీ గులాబీ బంతితో సగం ఆట రాత్రిపూట సాగుతుంది. కాబట్టి మంచు ప్రభావం ఉన్నప్పుడు సింథటిక్‌ దారంతో ఉన్న సీమ్‌ వల్ల బంతిపై పట్టు చిక్కదు. అందులో లినెన్‌ దారం తడిచి పీల్చుకోవడం వల్ల బౌలర్లకు ఇబ్బంది ఉండదు. ఇక ఎరుపు బంతిలో సీమ్‌ దారం తెలుపు రంగుతో ఉంటుంది. గులాబీపై అది వేస్తే సరిగా కనిపించడం లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. వేరే రంగులు కొన్ని ప్రయత్నించి.. చివరికి నలుపు రంగు దారాన్ని ఖరారు చేశారు. సీమ్‌ మన్నికపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో అది కాస్త దళసరిగా ఉండేట్లు చూస్తున్నారు. కాబట్టి బౌలర్లు దీన్ని ఉపయోగించుకుని స్వింగతో బ్యాట్స్‌మెన్‌ను మరింత ఇబ్బంది పెట్టే అవకాశముంది.
బౌలర్లకు సులువు..
గులాబీ బంతి ఎక్కువ స్వింగ్‌ అవ్వడానికి దానికి వేసే పీయూ కోట్‌ ఓ ముఖ్య కారణం. ఎరుపు బంతిలో లెదర్‌ మీద మైనం పూస్తారు. ఆట సాగే కొద్దీ దాన్ని బంతి ఇముడ్చుకుంటుంది. దీంతో బంతి రంగు కొంచెం మారుతుంది.  ఆ సమయంలోనే బౌలర్లు బంతిని ఒక వైపు బాగా రుద్ధి..రివర్స్‌ స్వింగ్‌కు ప్రయత్నిస్తారు. అయితే గులాబీ బంతి మీద మైనం పూస్తే కొన్ని ఓవర్లు తర్వాత బంతి నలుపు రంగులోకి మారి బ్యాట్స్‌మెన్‌కు సరిగా కనిపించట్లేదని తేలింది. అందువల్ల దీనిపై మైనం బదులు పీయూ కోట్‌ అనే పాలిష్‌ రంగును వేస్తున్నారు. దీని వల్ల కనీసం 40 ఓవర్ల పాటు బంతి రంగు మారదు. బంతి మీద అదనపు లేయర్‌లా ఉండే ఈ పాలిష్‌ వల్ల బంతి మరింతగా స్వింగ్‌ అవడమే కాక వేగం కూడా పెరుగుతుంది.
ఈ రంగే ఎందుకు?
డేనైట్‌ టెస్టుకు గులాబి బంతినే వినియోగించడానికి కొన్ని కారణాలున్నాయి. పగటి పూట నిర్వహించే టెస్టుల్లో వినియోగించే ఎరుపు బంతి మన్నిక ఎక్కువ. అయితే 20-30 ఓవర్ల  తర్వాత దాని రంగు పోయి నల్లగా అవుతుంది. డేనైట్‌ టెస్టుల్లో ఆ బంతిని ఉపయోగిస్తే రాత్రి కనిపించే అవకాశముండదు. దీంతో ప్రత్యామ్నాయంగా పసుపు, నారింజ రంగులు ప్రయత్నించి చూశారు. వాటితో ఇబ్బందులు తలెత్తాయి. అనేక ప్రయోగాల తర్వాత బ్యాట్స్‌మెన్‌కు సరిగ్గా కనిపించే ప్రత్యామ్నాయ రంగు గులాబినే అని దాన్నే ఖరారు చేశారు.  తెలుపు, ఎరుపు బంతులతో పోలిస్తే గులాబిబంతి లోపలి పదార్థంలో తేడా ఏమీ ఉండదు. వాటిలో మాదిరే ఉన్ని, కార్క్‌ల మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. దాని మీద తోలు అంటిస్తారు. 


No comments:

Post a Comment