మా వల్ల కాదు..ఉన్నత స్థాయి కమిటీ వేద్ధాం : హైకోర్టు

ఆర్‌టీసీ సమ్మెపై కోర్టు బుధవారానికి విచారణ వాయిదా

'' ఆర్‌టిసి సమ్మె విషయంలో ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాల ద్వారా సమస్య పరిష్కారమవుతుందన్న ఆశ ఒక్క శాతం కూడా లేదు. ప్రభుత్వం మా మాటే వినడం లేదు. గౌరవం కూడా ఇవ్వడం లేదు. కార్మిక న్యాయస్థానం మాట వించారన్న నమ్మకమూ లేదు. ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ  న్యాయమూర్తులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడమే ఆఖరి అవకాశం. కనీసం వారి మాటైనా వింటారని భావిస్తున్నాం. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.'' అని హైకోర్టు స్పష్టం చేసింది.
   ఆర్‌టిసి సమ్మె వ్యవహారం మంగళవారం హైకోర్టులో కొత్త మలుపు తిరిగింది. చర్చలతో వివాదాన్ని పరిష్కరించు కోవాలని ఇంత కాలం చెప్పిన హైకోర్టు అది సాధ్యం కాకపోవడంతో సమ్మె చట్టబద్ధతను తేలుస్తామని  పేర్కొంది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో ఉన్నత స్థాయి కమిటీ సమస్య పరిష్కారానికి ఆఖరి అవకాశంగా  పేర్కొంది. దీనిపై వైఖరి చెప్పాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తే సమ్మెపై 24 గంటల్లో నిర్ణయం చెబుతామని యూనియన్లు బదులిచ్చాయి.ఆర్‌టీసీ సమ్మెను సవాలు చేస్తూ దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కోర్టు సహాయకుడు సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ  కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమంటూ హైకోర్టులు తేల్చజాలవని, కార్మిక న్యాయస్థానమే సరైన వేదిక అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌టిసిని అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుని, ఆ జీవో టిఎస్‌ఆర్‌టికి ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. సెక్షన్‌ 3 కింద కొత్తగా ఆర్‌టిసినీ ఏర్పాటు చేసుకున్నామని చెబుతున్నందున ఏపీఎస్‌ఆర్‌టిసి ఇచ్చిన ఉత్తర్వులు ఇక్కడ వర్తించవని పేర్కొంది. టిఎస్‌ఆర్‌టిసి ఎస్మా పరిధిలోకి తీసుకువస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని తెలిపింది. న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ పారిశ్రామిక వివాదాల చట్టం కింద ప్రభుత్వం దీన్ని కన్సిలియేషన్‌ తీసుకువెళ్లిందని, అక్కడ విఫలం కావడంతో కన్సిలియేషన్‌ అధికారి ప్రభుత్వానికి అక్టోబర్‌5న నివేదిక అందజేశారన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కన్సిలియేషన్‌ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సెక్షన్‌ 12 కింద వివాదాన్ని కార్మిక న్యాయస్థానానికి నివేదించాలంది. బంతి ఇంకా ప్రభుత్వం కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించింది.

'' ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడానికి హైకోర్టుకు అధికారం ఉంది. వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో ఓ కమిటీ ఏర్పాటు చేస్తే సమ్మె కొనసాగించే విషయాన్ని పున:సమీక్షించుకుంటాం. సమ్మె కొనసాగింపుపై 24 గంటల్లోనే నిర్ణయాన్ని చెబుతాం.'' అని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.

''పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం వెళ్లాలన్నది ప్రభుత్వ ఉద్ధేశం. అక్టోబర్‌ 4న రాజీ చర్చలు విఫలమయ్యాయి. 5న యూనియన్లు సమ్మెకు వెళ్లాయి. 6న ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వివాదం హైకోర్టులో ఉన్నందున పారిశ్రామిక వివాదాల చట్టం కింద వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకోలేదు. ప్రధాన కార్యదర్శి అఫిడవిట్‌ ద్వారా మొత్తం పరిస్థితి వివరించాం. సమస్యల పరిష్కారానికి మేం ఏర్పాటు చేసిన కమిటీ సూచనలను యూనియన్లు పట్టించుకోలేదు. హైకోర్టు మాటలను విస్మరించాలన్న ఉద్ధేశం మాకు లేదు.'' అని ప్రభుత్వం పేర్కొంది. 


Post a Comment

0 Comments