Tuesday, November 12, 2019

అభివృద్ధికి స్వాగతిస్తే..పురోగతి శూన్యం..!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత కొత్త రెవెన్యూ కేంద్రం, మండలాల ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించగా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పటిష్టమైన సౌకర్యాలతో పనులు వేగంగా పూర్తి చేస్తారనుకున్నారు ప్రజానీకం. అధికార వికేంద్రీకరణతో తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆశించారు. కానీ మూడేళ్లు గడిచినా పురోగతి అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రజలు పాత పద్ధతులే నయం అన్నట్టు పెదవి విరుస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో ప్రధాన శాఖల డివిజన్‌ కార్యాలయాలు కూడా  అందుబాటులోకి రాలేని పరిస్థితి నెలకొంది. నూతన మండల కేంద్రాల్లోనూ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పూర్వ ఖమ్మం జిల్లాలో జిల్లా, మండలాల పునర్విభజన చోటు చేసుకుంది. జిల్లాలో కల్లూరు రెవెన్యూ డివిజన్‌ ఆవిర్భవించగా రఘునాథపాలెం మండలం తొలి నుంచి ఉన్నప్పటికీ మండల పునర్విభజనలో భాగంగా రెవెన్యూ శాఖ ఏర్పడింది.
        భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం రెవెన్యూ డివిజన్లు పాతవే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పాల్వంచ రెవెన్యూ డివిజన్‌ రద్ధయ్యింది. లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్‌, ఆళ్లపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలాలు నూతనంగా మనుగడలోకి వచ్చాయి. రెవెన్యూ డివిజన్‌, నూతన మండలాలు 2016 అక్టోబరు 11నుంచి కార్యకలాపాలు ప్రారంభించాయి. ఖమ్మం జిల్లా 21 మండలాలతో విస్తరించగా కల్లూరు రెవెన్యూ డివిజన్‌లో ఆరు మండలాలను చేర్చారు. సత్తుపల్లి  నియోజకవర్గంలోని సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, తల్లాడ, వేంసూరు మండలాలతో పాటు వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు మండలం కలిసి కల్లూరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. ఇక్కడ తహశీల్ధార్‌ కార్యాలయాన్ని రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం(ఆర్‌డిఓ)గా మార్చారు. సాంఘిక సంక్షేమ, బీసి సంక్షేమ డివిజన్‌ కార్యాలయాలు వచ్చాయి. కల్లూరుకు అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌(ఏసీపీ) పోస్టు మంజూరైంది.

సమస్యలీవే...!

- ఏసీసీ కార్యాలయం భవనం, క్యాంపు నిర్మాణానికి ఒక ఎకరం స్థలం కేటాయించారు. 2016 మార్చి 23న శంకుస్థాపన చేశారు. స్థల వివాదం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు.
- కల్లూరు రెవెన్యూ డివిజన్‌లో ఆర్‌టిసి ప్రయాణ ప్రాంగణం లేదు. బస్సుల కోసం ప్రధాన రహదారిపైనే ప్రయాణికులు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంటోంది.
- ఆర్‌డబ్ల్యూఎస్‌ డివిజన్‌ కార్యాలయం సత్తుపల్లిలోనే ఉంది. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ కార్యకలాపాలు సత్తుపల్లి నుంచే కొనసాగుతున్నాయి.
- కల్లూరు తహశీల్దార్‌  కార్యాలయ భవనానికి ఓ వైపు ఆర్‌డిఓ కార్యాలయం అని పేరు రాసి విధులు నిర్వహిస్తున్నారు. 
- కల్లూరు రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైనా వైరాలో ఎస్‌టిఓ కార్యాలయం ఏర్పాటు చేశారు.
- కల్లూరుకు ఏసీపీ నియామకం చేసినప్పటికీ కార్యాలయం లేకపోవడంతో సత్తుపల్లి నుంచి పర్యవేక్షణ చేయాల్సి వస్తోంది.

మండలాల విషయానికి వస్తే..

- ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలానికి ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ విభజన జరిగింది.
- భద్రాద్రి జిల్లా గుండాల నుంచి విడివడిన ఆళ్లపల్లి మండల పరిస్థితి కొంత కష్టంగా ఇష్టంగా మారింది. మర్కోడు నుంచి నడిగూడెం, పెద్దూరు, కందిబంధం గ్రామాల మధ్య ఉన్న జల్లేడు వాగు వంతెన నిర్మాణం పూర్తి చేసుకోవడంతో సౌకర్యంగా మారింది. రామానుజుగూడెం, వలసెల్ల, ఇప్పెనపల్లి, తీగలంచల మధ్య వంతెన నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది.
- మార్కోడు నుంచి కరకగూడెం గుట్టదారి వైపు రహదారి బాగ చేయాల్సిన అవసరం నెలకొంది.
- ఆళ్లపల్లి మండలం కావడంతో అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఇది కొంత స్థానికులకు ఉపశమనం             కలిగించే అంశం. ఎక్కడా శాశ్వత భవనాలు లేకపోవడం గమనార్హం.
- ఆళ్లపల్లి, కరకగూడెం పరిధిలో పోలీస్‌స్టేషన్‌ గతంలోనే ఉన్నాయి. మిగిలిన నూతన మండలాలు సుజాతనగర్‌,           చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, అన్నపురెడ్డిపల్లిలో మండలాలు ఏర్పడిన తర్వాత పీఎస్‌లు ఏర్పాటు చేశారు.
- అన్నపురెడ్డిపల్లి మండలంతోపాటు కొత్తగా ఏర్పడిన ఏ మండలంలోనూ ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత                 భవనాలు లేవు.

No comments:

Post a Comment