ఆదేశాలిచ్చి..రెండు వారాలైంది: హైకోర్టు

రాష్ట్రంలో డెంగ్యూ నివారణపై ప్రభుత్వం అందించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దోమల నివారణకు యంత్రాలు కొనుగోలు చేయాలంటూ ఆదేశాలిచ్చి రెండువారాలైనా నేటికీ సమకూర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ తప్పుపట్టింది. మరో రెండు వారాల్లో సీజన్‌ ముగిసిపోనుందని, ఇంకెప్పుడు కొంటారని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. డెంగీ నివారణకు సరైన చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ డాక్టర్‌ ఎం.కరుణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు, న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను సుమోటోగా తీసుకొని హైకోర్టు విచారణ చేపట్టిన విషయం విధితమే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

నివేదికలో ప్రభుత్వం తెలిపిన అంశాలు..

డెంగ్యూ నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పోర్టబుల్‌ ఫాగింగ్‌ యంత్రాలు ప్రస్తుతం 155 ఉండగా అదనంగా 150 కొనుగోలు చేశామని చెప్పారు. మౌంటెడ్‌ ఫాగింగ్‌ యంత్రాలు 10 ఉండగా మరో 50 కొనుగోలు చేస్తున్నామని, పవర్‌ స్ప్రేయర్లు 50 ఉండగా 950 కొనుగోలు చేస్తున్నామని, న్యాప్‌శాక్‌ స్ప్రేయర్లు 667 ఉండగా మరో 133 కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైన కమిటీ గత నెల కేంద్ర బృందంతో చర్చలు జరిపిందని తెలిపారు. శుభ్రతను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యర్థాల నియంత్రణ, నిర్వహణతో పరిశుభ్రత పెంచుతూ దోమలు పెరగకుండా చూస్తున్నామన్నారు. నివేదికను పరిశీలించిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

Post a Comment

0 Comments