Sunday, October 27, 2019

ఆర్‌టిసి సమ్మెపై తాడోపేడోకి ప్రభుత్వం సిద్ధం

తెలంగాణలో ఆర్‌టిసి కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె బాట పట్టి 23 రోజులు గడిచింది. అయితే శనివారం జరిగిన చర్చలు విఫలం కావడంతో సోమవారం కోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉండటంతో ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఆర్‌టిసి ఇంచార్జ్‌ ఎండి సునీల్‌శర్మ, ఈడీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో  సోమవారం కోర్టుకు ఇవ్వాల్సిన నివేదికపై నిశితంగా  చర్చించారు. చర్చలు విఫలం కావడంతో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. 

సమ్మెపై ఇక తాడోపేడో...

ఆర్‌టిసి సమ్మెపై తాడోపేడో తేల్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్‌టిసి జేఏసీ నేతలు చర్చలను బహిష్కరించి వెళ్లిపోయారని కోర్టుకు ఆర్‌టీసీ యాజమాన్యం నివేదిక ఇవ్వనున్నది. ప్రత్యామ్నాయ చర్యలు వేగవంతం చేస్తూనే ఆర్‌టిసిలో అద్దె బస్సులను పెంచేందుకు మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా  ఈ సందర్భంగా కేసీఆర్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు రూట్లపై త్వరలో సర్వే నిర్వహించి రూట్లు, విధివిధానాలపై కసరత్తు చేయాలని మంత్రి, అధికారులను సీఎం ఆదేశించారు. ఇవాళ జరిగిన సమీక్షతో పుల్‌స్టాఫ్‌ పడుతుందని అందరూ భావించారు. కానీ ఇంకా చర్చలు కొనసాగే అవకాశం ఉంది. 
ఒక ప్రక్క  సోమవారం నాడు కలెక్టరేట్ల ముట్టడికి ఆర్‌టిసి జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ పిలుపుకు కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు చర్చలకు ఎప్పుడు పిలిచినా రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆర్‌టిసి జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. సోమవారం కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసి 30న సకల జనుల సమరభేరి సభను విజయవంతం చేస్తామని తెలిపారు. 

No comments:

Post a Comment