ఆర్‌టిసికి పూర్తి స్థాయి ఎండీని ఎందుకు నియమించలేదు?:హైకోర్టు

విచారణ రేపటికి వాయిదా

సమ్మె  వ్యవహారంపై సోమవారం ఉన్నత న్యాయస్థానంలో ఆర్‌టిసి యాజమాన్యం, కార్మిక సంగాల జేఏసీ నాయకుల మధ్య వాదనలు కొనసాగాయి. ఆర్‌టిసి సమ్మె పరిష్కారానికి విలీన అంశం ప్రధాన ఆటంకంగా ఉందని, మిగతా అంశాలపై బేధాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతానికి మిగతా అంశాలు ముందుగా చర్చించాలని పేర్కొన్నట్లు తెలిపింది. రాత్రికి రాత్రే సమ్మె సమస్యలన్నీ పరిష్కారం కావని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తమ డిమాండ్లను ఆర్‌టీసీ యాజమాన్యం అంగీకరిస్తుందా? లేదా? అనేది తర్వాత విషయమని చర్చించడానికి తప్పేంటని కార్మిక సంఘాల తరపు న్యాయవాది వాదించారు. ప్రస్తుతానికి ఆర్‌టిసి విలీనం డిమాండ్‌ను పక్కన పెట్టకపోతే ప్రతిష్టంభన ఇలానే కొనసాగుతుందని, ఇరు వర్గాల మధ్య సామాన్య ప్రజలు నలిగిపోతున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈడీల కమిటీ నివేదికపై అసంతృప్తి..

ఈడీల కమిటీ 21 అంశాలను అధ్యాయనం చేసి ఆర్‌టిసి ఎండీకి నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏఏజీ) రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. 21 డిమాండ్లలో 16 అంశాలకు డబ్బులు అవసరమని ప్రస్తుతానికి ఆర్‌టిసికి ఆ స్థాయి ఆర్థిక స్థితి లేదని కమిటీ తెలిపినట్లు ఆయన వివరించారు. మరో రెండు అంశాలకు చాలా నిధులు అవసరమని అవి అసాధ్యమని పేర్కొందన్నారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ఈడీల కమిటీ నివేదికను తమకెందుకు సమర్పించలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలు తమ వద్ద కూడా దాచి పెడతారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆర్‌టిసి  పూర్తి స్థాయి ఎండీని ఎందుకు నియమించలేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకోవాలి...

డిమాండ్లు  అంగీకరించడం సాధ్యం కాదని ముందే నిర్ణయించుకుంటే ఎలా? అని హైకోర్టు అదనపు ఏజీని ప్రశ్నించింది. ముందే నిర్ణయించుకుని కార్మికులను చర్చలకు పిలిస్తే లాభమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ''ఆర్‌టిసి కార్మికుల కంటే ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టిలో ఉంచుకోవాలి. 21 డిమాండ్లలో నాలుగింటి పరిష్కారానికి రూ.46.2 కోట్లు అవసరమని నివేదికలో పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ఆర్‌టిసికి ప్రభుత్వం రూ.50 కోట్లు ఇవ్వగలదా? రూ.50 కోట్లు ఇస్తే ప్రస్తుతానికి సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం.'' అని న్యాయస్థానం ఆశాభావం వ్యక్తం చేసింది. దీనిపై అదనపు ఏజీ సమాధానమిస్తూ .. ప్రభుత్వం ఆర్‌టిసికీ రూ.50 కోట్లు ఇవ్వలేదని చెప్పారు. అదనపు ఏజీ సమాధానంపై ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేస్తూ అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ)ని పిలవాలని ఆదేశించింది. దీంతో ఏజీ బ్రీఎస్‌ ప్రసాద్‌ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కార్మిక సంఘాల తీరు సరిగాలేదని, రూ.50 కోట్లతో సమస్య పరిష్కారం కాదని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఎన్నో ఖర్చులు చేస్తోంది. రూ.47 కోట్లు ఇవ్వలేదా? అని ఏజీని న్యాయస్థానం ప్రశ్నించగా, ప్రభుత్వాన్ని అడిగి రేపు చెబుతామని ఆయన సమాధానమిచ్చారు. ''మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి..సీఎస్‌, ఆర్థికశాఖ కార్యదర్శిని పిలుస్తాం'' అని ఏజీని ఉద్ధేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. 

జీహెచ్‌ఎంసీ రూ.1400 కోట్లు ఇవ్వాలి: కార్మిక  సంఘాలు

తమ సమస్యలకు సంస్థ నష్టాలు కారణం కాదని ఆర్‌టిసి కార్మిక సంఘాలు హైకోర్టుకు తెలిపాయి. రాయితీ బస్‌పాసుల వల్ల రోజుకు రూ.2.3 కోట్ల నష్టం వస్తోందని కార్మిక సంఘాల తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ సంస్థ నష్టాల్లో ఉందని మీరే ఒప్పుంకుంటున్నారని, మీరు కూడా సహేతుకంగా ఉండాలని సూచించింది. ఆర్‌టీసీకి జీహెచ్‌ఎంసీ రూ.1400 కోట్లు ఇవ్వాల్సి ఉందని కార్మిక సంఘాలు ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రైవేటు ఆపరేటర్లలా నేరుగా టికెట్‌ ఛార్జీలు పెంచుకునే అధికారం ఆర్‌టీసీకి లేదని తెలిపారు. రీయింబర్స్‌మెంట్‌, జీహెచ్‌ఎంసీ బకాయిలు రూ.4,967 కోట్లు ఉన్నాయంటూ కార్మిక సంఘాలు చెబుతున్నది  నిజమేనా? అని హైకోర్టు ఆర్‌టీసీని ప్రశ్నించింది. దీనిపై రేపు పరిశీలించి చెప్పాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను  రేపు మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

Post a Comment

0 Comments