ఆర్‌టిసి కార్మికులకు అండగా ఖమ్మం జర్నలిస్టులు

15 రోజులుగా చేపడుతున్న ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు శనివారం రాష్ట్ర వ్యాప్త బంద్‌లో భాగంగా ఖమ్మంలో ఆర్‌టిసి కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా టియుడబ్ల్యుజె(ఐజెయు) యూనియన్‌ జర్నలిస్టు నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్థానిక బస్టాండ్‌ వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో యూనియన్‌ నాయకులతో పాటు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా పాత్రికేయులు అందరూ బంద్‌ కార్యక్రమంలో పాల్గొని నినాదాలు చేశారు. అనంతరం ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కెసిఆర్‌ పాలన గాడి తప్పిందని, ఆర్‌టిసి కార్మికుల విషయంలో నియంతంలా ప్రవరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఆర్‌టిసి కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ ప్రజా వ్యతిరేఖ ధోరణి అవలంభించడం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని పేర్కొన్నారు. ఆఖరికి కోర్టు కూడా మొట్టికాయలు వేసినా పూర్తిస్థాయిలో ఆర్‌టిసి ఎండిని నియమించలేకపోతున్నారని అన్నారు. ఆర్‌టిసి కార్మికులకు ప్రజల నుండి పూర్తి స్థాయి మద్దతుతో పాటు అనేక ఉద్యోగ సంఘాలు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తాము కూడా ఆర్‌టిసి కార్మికులకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని, వారి సమస్యలు పరిష్కారమయ్యే వరకూ తమ సంఘం తరపున పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రాం నారాయణ, ఏనుగు వెంకటేశ్వరరావు, వనం వెంకటేశ్వర్లు, పాపారావు, మాధవ్‌, వెంకట్రావ్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments