Tuesday, October 29, 2019

ఆర్‌టిసి 'ప్రైవేటు' పరానికి రంగం సిద్ధం: రూట్లపై సర్వేకు సీఎం ఆదేశం!

ముందుగా ఖమ్మం, నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌,నిజామాబాద్‌ మార్గాల్లో..!

తెలంగాణ రాష్ట్రంలో ఆర్‌టిసి బస్సు రూట్లను ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఏఏ రూట్లను అప్పగించొచ్చు, ఎంత ఫీజును వసూలు చేయొచ్చు, ఏ రూట్ల నుంచి ఎంత ఆదాయం వస్తుందన్న దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. దీంతోపాటు ప్రైవేటు బస్సుల నియంత్రణ కోసం విధి విధానాలు, టికెట్‌ ఛార్జీలపైనా కసరత్తు చేస్తున్నారు. రెండు రోజుల కింద ప్రగతిభవన్‌ లో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ప్రైవేటు రూట్లపై సర్వే చేయాలని సీఎం కేసీఆర్‌ రవాణాశాఖను ఆదేశించినట్లు సమాచారం. '' ఏ రూట్లను ప్రైవేటుకు ఇవ్వాలి, ఏ రూట్లలో ఎక్కువ ప్రయాణీకులు ఆర్‌టిసి బస్సుల్లో జర్నీ చేస్తున్నారు. రూట్లను అమ్మితే వచ్చే ఆదాయం ఎంతో నివేదిక ఇవ్వండి.'' అని సూచించినట్లు  సమాచారం. ఈ మేరకు రవాణా శాఖలోని సీనియర్‌ అధికారుల బృందం రూట్ల ప్రైవేటీకరణపై సర్వే మొదలు పెట్టిందని,  ఏరూట్లలో ఎన్ని సర్వీసులు నడుస్తున్నాయో, ఏ రూట్లలో ఎక్కువ రద్దీ ఉన్నదో వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నట్లు తెలిసింది.

జిల్లా కేంద్రాల నుంచి నగరానికి..

ప్రస్తుతం రాష్ట్రంలో స్టేజీ క్యారియర్‌గా ఆర్‌టిసి మాత్రమే బస్సులు నడుపుతోంది. కొన్ని రూట్లలో కాంట్రాక్టు క్యారియర్లుగా ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి రోజూ వెయ్యి బస్సులు హైదరాబాద్‌కు ప్రయాణీకులను చేరవేస్తున్నాయి. ఇందులో వివిధ జిల్లాల కేంద్రాల నుంచి నిర్వహిస్తున్నవే 70 శాతానికిపైగా ఉంటాయి. ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌తో పాటు మంచిర్యాల, గోదావరిఖని, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సుల్లో వందశాతం ఆక్యుపెన్సీ ఉంటుంది. ముందుగా ఈ రూట్లను ప్రైవేటుకు అప్పగించే అవకాశం ఉందని ఓ సీనియర్‌ ఐఏఏస్‌ అధికారి చెప్పారు. ఇప్పటికే కాంట్రాక్ట్‌ క్యారియర్‌ కింద నిజమాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ లకు కొన్ని ప్రైవేటు సంస్థలు బస్‌ సర్వీసులు నిర్వహిస్తున్నాయి.

రవాణా శాఖ పరిధిలోకే...

ప్రైవేటు బస్సులను ఎవరి నియంత్రణలో ఉంచాలన్న దానిపైనా ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ఆర్‌టిసి నియంత్రణలో ఉంచాలా, లేక రవాణా శాఖ పర్యవేక్షణ కిందికి తేవాలా అనే ఆలోచన చేస్తున్నారు. పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టులో ఆర్‌టిసి వాటా తగ్గిస్తుంటే.. ఆ సంస్థ నియంత్రణలో ప్రైవేటు బస్సులను ఉంచడం మంచిదికాదని కొందరు అధికారులు చెప్తున్నారు. నేరుగా ప్రభుత్వ పరిధిలో ఉంటే నియంత్రణ సమర్థవంగా ఉంటుందని అంటున్నారు. రవాణా శాఖ సీనియర్‌ అధికారికి ప్రైవేటు బస్సుల పర్యవేక్షణ అప్పగించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక్కో సీటుకు ప్రభుత్వానికి ఎంత చెల్లించాలి, బస్‌ఛార్జీలు ఏమేరకు ఉండాలనేది ప్రభుత్వమే నిర్ణయించేలా నింబంధనలు ఉంటాయని వెల్లడిస్తున్నారు. 

ముందొచ్చిన వారికే అవకాశం...

రూట్ల అప్పగింత కోసం ఓపెన్‌ టెండర్‌ విధానం పాటించాలా, లేక ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ఇవ్వాలా అన్న దానిపై సీఎం వద్ద చర్చ జరిగినట్టు తెలిసింది. ఓపెన్‌ టెండర్‌కు అవకాశం ఉండే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని, మొదట వచ్చిన వారికి మొదట రూట్లను కేటాయించేందుకు సీఎం మొగ్గు చూపే అవకాశం ఉందని ఓ అధికారి చెప్తున్నారు. 

త్వరలో నోటిఫికేషన్‌..

రూట్లను ప్రైవేటు వారికి అప్పజెప్పడంపై నవంబర్‌ తొలివారంలోగానీ, రెండో వారంలోగానీ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రూట్‌ను సొంతం చేసుకున్న సంస్థ బస్సుల్లో ఒక్కో సీటుకు ప్రభుత్వానికి ఏటా ఎంత చెల్లించాలి, ఎన్ని వాయిదాల్లో చెల్లించాలి, నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే జరిమానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 'రూట్లను ప్రైవేటుకు అప్పగించినా  ప్రభుత్వం నిర్ణయించిన టికెట్‌ ఛార్జీల కంటే ఎక్కువుగా వసూలు చేయకూడదు, నిర్ధేశించిన సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడానికి అనుమంతి ఉండే అవకాశం ఉండదు.  

No comments:

Post a Comment