Saturday, October 26, 2019

'హుజూర్‌నగర్‌'పై సీఎం కేసీఆర్‌ హామీల వరాల జల్లు

సైదిరెడ్డి గెలుపుతో కృతజ్ఞత సభకు హాజరైన సీఎం కేసీఆర్‌

హుజూరునగర్‌ లో శాసనసభ్యునిగా సైదిరెడ్డి గెలుపును పురస్కరించుకొని  శనివారం జరిగిన కృతజ్ఞత సభకు సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  సూర్యాపేట జిల్లా నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున సభకు చేరుకున్నారు. తొలుత ఆటపాటలతో సభ వద్ద కళాకారులు దూందాం కార్యక్రమం నిర్వహించారు. భారీ కాన్వాయ్‌తో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుండి హుజూర్‌నగర్‌ పట్టణానికి చేరుకున్నారు. 
ఈ సందర్భంగా సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ  శానంపూడి సైదిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి ఉవ్వెత్తున ఉత్సాహమైన ఫలితం ఇచ్చినందుకు ప్రజలకు  నమస్కారాలతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గెలుపుకు కృషి చేసిన మంత్రి జగదీష్‌రెడ్డికి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిజేశారు. నియోజకవర్గ ప్రజలను ఉద్ధేశించి హామీల వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేస్తామని, జీవో విడుదల చేస్తామన్నారు.  7 మండల కేంద్రాలకు ఒక్కొక్కదానికి రూ.30 లక్షలు చొప్పున మంజూరు చేస్తున్నాం అన్నారు. హుజూరునగర్‌, నేరేడుచర్ల మున్సిపాలిటీకి తన నిధుల నుంచి రూ.25 కోట్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. హుజూర్‌నగర్‌ను జిల్లాలోనే  పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. రూ.15 కోట్లు నేరేడుచర్ల అభివృద్ధికి మంజూరు చేస్తామన్నారు.  ఇక్కడ ఉన్న లంబాడ సోదరులకు మాట ఇస్తున్నామని, మీ అందరికీ అభివృద్ధి జరుగుతుందని, గిరిజనుల కోసం రెసిడెంన్షియల్‌ పాఠశాల, బంజారా భవన్‌ మంజూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు. మిర్యాలగూడ, నాగార్జున సాగర్‌ తదిర ప్రాంతాల్లో పోడు భూముల సమస్య పరిష్కారం ప్రజా దర్బార్‌ కార్యక్రమం ద్వారా స్వయంగా తానే తిరిగి  పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ డివిజన్‌ హుజూర్‌నగర్‌కు కేటాయిస్తున్నామన్నారు. హుజూరునగర్‌ ప్రాంతంలో చాలా సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి గనుక ఈఎస్‌ఐ ఆసుపత్రిని మంజూరు చేపిస్తామని కేంద్రంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. మేళ్ల చెర్వు, చింతలపాలెం మండల ప్రజలకు  హుజూరునగర్‌లోనే కోర్టు కావాలని అడుగుతున్నారు కనుక ఈ రెండు మండలాలను హుజూర్‌నగర్‌లోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని అందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కూడా మంజూరు చేస్తామన్నారు. 

1997లో విన్న సమస్యలే ఇప్పుడు వింటున్నా...!

ఎన్‌టిఆర్‌ కాలంలో నేను మంత్రిగా పనిచేశానని తెలిపారు. నల్గొండను అప్పట్లో సందర్శించానని కరువు ప్రాంతమని వివరించారు. 1997లో తాను కరువు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పారో ఈ రోజు కూడా అదే సమస్యలు చెబుతున్నారని ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి జరగలేదని తెలిపారు. తాను ఎవ్వర్నీ విమర్శించేందుకు రాలేదని అభినందన సభ కోసమే వచ్చానన్నారు. జగదీష్‌రెడ్డి మూడు ఫీట్లు ఉన్నాడని ప్రతిపక్షాలు ఎన్నికల ముందు విమర్శించారని,  కానీ 300కిలోమీటర్ల వరకు కాళేశ్వరం నీళ్లు తెప్పించిన మంచి వ్యక్తి అని కొనియాడారు. యావత్తు తెలంగాణ రైతాంగానికి చెబుతున్నా కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానని మాట ఇస్తున్నాం అని అన్నారు. ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం నుంచి సీతారామ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామని  దాని వల్ల కొన్ని బాధలు పోతాయని అన్నారు. సూర్యాపేటలో కోదాడ, నడిగూడెంలో, తుంగతుర్తిలో కాళేశ్వరం నీరు వస్తున్నాయన్నారు.  హుజూరునగర్‌లో రింగ్‌రోడ్డు, ట్యాంక్‌బండ్‌లా చెరువును చేస్తామని అన్నారు. రైతు బంధు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రారంభించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. 

ఉత్సాహంతో..సైదిరెడ్డి పనిచేయాలి..!

ఇప్పటి వరకు సైదిరెడ్డి వేరు అని ఇప్పుడు ఎమ్మెల్యే సైదిరెడ్డి అని ప్రజలకు పరిచయం చేశారు. ఉత్సాహమైన యువకుడు అని అదే ఉత్సాహంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఎలాంటి కుల, మత బేధం లేకుండా హుజూర్‌నగర్‌ను అభివృద్ధివైపుకు దూసుకుపోయేలా కృషి చేయాలని కోరారు. ఇంత అద్భుతమైన మెజార్టీతో సైదిరెడ్డిని గెలిపించి నన్ను ఉత్సాహింపజేసిన హుజూర్‌నగర్‌ ప్రజలకు మరొక్క సారి వందనం అంటూ ముగించారు. 

No comments:

Post a Comment