Wednesday, October 23, 2019

కార్మికులకు సింగరేణి యాజమాన్యం షాక్‌..!

- చరిత్రలో బోనస్‌ తప్పడం ఇదే తొలిసారి
- విద్యుత్‌ సంస్థల బకాయిలే కారణం!
- వచ్చే నెలలో అందజేసే అవకాశం?

దీపావళి పండుగ సందర్భంగా కార్మికులకు సింగరేణి యాజమాన్యం షాక్‌ ఇచ్చింది. ''పైసల్లేవ్‌..ఇప్పుట్లో బోనస్‌ ఇవ్వలేం.. వచ్చే నెల అక్టోబర్‌ జీతాలు ఇచ్చాక చూద్దాం..ఇప్పుడైతే ఏం చేయాలేం..'' అంటూ బొగ్గు గని కార్మికులకు సింగరేణి కాలరీస్‌ యాజమాన్యం సర్ధి చెబుతూ షాకిచింది. బొగ్గు గని సంస్థల్లో  ఏటా ప్రాఫిట్‌ లింకడ్‌ రివార్డు(పిఎల్‌ఆర్‌) బోనస్‌ ఇవ్వడం ఆనవాయితీ. దేశంలోని ఇతర బొగ్గు సంస్థల్లో  ఈ బోనస్‌ను దసరాకు ముందు ఇస్తుండగా.. సింగరేణిలో మూడు దశాబ్ధాలుగా దీపావళికి వారం ముందే అందజేస్తున్నారు. గత ఏడాది ప్రతి కార్మికుడికి రూ.60,500 చొప్పున బోనస్‌ చెల్లించారు. ఈ సారి జాతీయ సంఘాల చొరవతో  దాన్ని 64,700 కి పెంచారు. పీఎల్‌ఆర్‌ బోనస్‌ కింద 48 వేల మందికి రూ.280 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఐదు రోజుల్లో దీపావళి పండుగ ఉన్నా బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో గుర్తింపు కార్మిక సంఘం టిబిజెకెఎస్‌ నాయకులు యాజమాన్యాన్ని  సంప్రదించారు.  అధికారులు మాత్రం ఇప్పట్లో బోనస్‌ సాధ్యం కాదని తెగేసి చెప్పారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. సింగరేణి నష్టాల్లో ఉన్నప్పుడు బోనస్‌ ఆపలేదని, నిర్ణీత సమయంలోగా రెండు విడతల్లో అందజేసిన దాఖలాలున్నాయని పేర్కొన్నారు. గతేడాది రూ.1,766 కోట్ల లాభాలను ప్రకటించి..రూ.494 కోట్లను కార్మికులకు పంపిణీ చేసిన సంస్థ బోనస్‌ చెల్లించలేని స్థితిలో ఉండటం దారుణమని యూనియన్‌ నాయకులు పేర్కొంటున్నారు. కాగా.. విద్యుత్‌ సంస్థలు సింగరేణికి రూ.7 వేల కోట్ల మేరకు బకాయి పడ్డాయి.దీని వల్ల సింగరేణి యాజమాన్యం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
దసరాకు ..ఆర్‌టిసి..దీపావళికి సింగరేణి?
సింగరేణి కార్మికులు దీపావళి జరుపుకోవాలంటే పీఎల్‌ఆర్‌ బోనస్‌ ముఖ్యం. ఈ సారి బోనస్‌ లేకపోవడంతో పండుగ జరుపుకునే పరిస్థితుల్లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా దసరాకు ఆర్‌టిసి కార్మికులకూ జీతాలు రాక పండుగ జరుపుకోలేదు. రెండు సంస్థల్లోనూ కార్మికుల సంఘ దాదాపు 48 వేలకు పైగా ఉండటం గమనర్హం.

No comments:

Post a Comment