Sunday, October 20, 2019

ప్రభుత్వం హింసను ప్రోత్సహిస్తోంది..!

పోటు రంగారావుపై పోలీసుల దాష్టికాన్ని ఖండిస్తూ అఖిలపక్షం ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం చట్టాలను నిర్వీర్యం చేస్తూ హింసను ప్రోత్సహిస్తుందని ఖమ్మం జిల్లా అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అఖిలపక్షం విమర్శించింది. శనివారం హైదరాబాద్‌లో ఆర్‌టిసి కార్మికుల చేస్తున్న బంద్‌ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ(ఎంఎల్‌) న్యూడమెక్రసీ రాష్ట్ర సహాయకార్యదర్శి పోటు రంగారావు విషయంలో పోలీసుల దాష్టికాన్ని అఖిలపక్షం తీవ్రంగా ఖండించింది. ఆదివారం ఖమ్మం నగరంలోని స్థానిక సిపిఐ(ఎంఎల్‌) న్యూడమెక్రసీ కార్యాలయంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయా పార్టీల నాయకులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని, సిఎం కేసీఆర్‌ ఒక నియంతలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా ఆర్‌టిసి కార్మికులు చేస్తున్న సమ్మె విషయంలో తప్పుడు కేసులు బనాయించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని అన్నారు. కోర్టు రెండు సార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా సీఎం కేసీఆర్‌ ఏకపక్ష దోరణితో ఆర్‌టిసి కార్మికుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదని పేర్కొన్నారు. 

రేపటి నుండి నిరసనలు..

పోటు రంగారావుపై పోలీసుల దాడికి నిరసనగా రేపటి నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరసన కార్యక్రమాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో తలపెట్టనున్నట్టు పేర్కొన్నారు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిపై పోలీసులు అలా వ్యవహరించడం ఏంటని వారు ప్రశ్నించారు. రంగరావు బొటన వేలు కట్‌ అయ్యేలా కఠినంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌టిసి కార్మికులకు ప్రజల నుండి పూర్తి మద్దతు ఉందని అలానే అన్ని రంగాల నుండి అన్ని సంఘాల నుండి మద్దతు వస్తుందని తెలిపారు. వారివి న్యాయమైన డిమాండ్లు అని ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని లేకుంటే సకల జనుల సమ్మె తప్పబోదని హెచ్చరించారు. 

No comments:

Post a Comment