Thursday, October 24, 2019

డిపో ఎదుట ఆటపాట- 19వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 19వ రోజు కూడా కొనసాగింది. తెలంగాణ ఆర్టీసీ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా అసువులు బాసిన తొలి అమరుడు దేవి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దశదిన కార్యక్రమం సందర్భంగా డిపో ఎదుట ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కార్మికులు శ్రీనివాసరెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీరుమున్నీరయ్యారు. ఆందోళనలో భాగంగా బుధవారం ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి మరణం తర్వాత అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కార్మికులు డిపో ఎదుట ఆందోళన చేపట్టి బతుకమ్మ ఆట పాట ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష లో ఉన్న రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి సమస్యలను వివరించారు. తమ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కలిశారు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ను కలిసి వినతి పత్రం అందజేశారు. నగర మేయర్ డాక్టర్ గుగులోత్ పాపాలాల్ ను  సైతం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్య కు పరిష్కారం చూపాలని కోరారు. 50 వేల కుటుంబాలు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రోడ్డున పడ్డాయని విమర్శించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోటు ప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు క్లెమెట్, మహమ్మద్ సలాం, తాటి వెంకటేశ్వరరావు, ఏ ఐ టి యు సి నాయకులు గాదే లక్ష్మీనారాయణ, సిపిఎం నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, యర్రా శ్రీనివాస్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఆవుల అశోక్ , కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ దుర్గాప్రసాద్, జేఏసీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ అప్పారావు, లింగమూర్తి , నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment