![]() |
USElection2020 |
ట్రంప్ ట్విట్ తొలగింపు
అమెరికా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అభ్యర్థులిద్దరి మధ్యా గట్టి పోటీ నడుస్తోంది. విజయంపై ఇరు పక్షాలు ధీమా గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశాలు, ప్రకటనలు సైతం చేస్తున్నారు. డెమొక్రాటిక్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థి బైడెన్ కొద్ది గంటల క్రితమే మీడియాతో మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మీడియా ముందుకు రాకపోయినా ట్విటర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు. భారీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భారీ విజయం దిశగా ఉన్నాం. ‘వాళ్లు ఎన్నికల్లో మోసం చేయడానికి ప్రయత్ని స్తున్నారు. అలా జరగనివ్వం. పోలింగ్ అయిపోయిన తర్వాత ఓట్లు వేయడానికి ఒప్పుకోం.’ అంటూ సంచలన కామెంట్లు చేశారు. ఈ ట్వీట్లోని వ్యాఖ్యలు ఎన్నికల్ని తప్పుదోవపట్టించేవిగా ఉన్నాయంటూ ట్విట్టర్ దాన్ని తొలగించింది. కాగా ఇప్పటి వరకు జో బైడెన్ 224, డొనాల్డ్ ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు.
సొంత గడ్డపై బైడెన్ వెనుకంజ
పెన్సిల్వేనియా రాష్ట్రాన్ని ట్రంప్, బైడెన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ తుదివిడత ప్రచారంలో దీనిపై ఎక్కువ దృష్టి సారించారు. కీలకమైన స్వింగ్ స్టేట్స్లో అత్యధిక ఓటర్లు ఉన్న మూడో పెద్ద రాష్ట్రం అది. ఇక్కడ దాదాపు 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో గెలుపు కోసం బైడెన్ విపరీతంగా శ్రమించారు. 2016 లో ఈ రాష్ట్రం ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించింది. గతంలో డెమొక్రాట్లకు ఇక్కడ పట్టు ఉండగా, గత ఎన్నికల్లో ఇది రిపబ్లికన్ల ఖాతాలో చేరింది. అందుకు ముందు ఇక్కడ డెమొక్రాట్లు ఆరు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అన్నింటికి మించి ఇది జో బైడెన్ సొంత రాష్ట్రం. దీంతో ఇక్కడి ఎన్నిక ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ మూడు వారాల క్రితం వరకు నిర్వహించిన అభిప్రాయ సేకరణల్లో బైడెన్ దాదాపు 7 పాయింట్ల వరకు ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. కానీ, చివర్లో ఇక్కడ ట్రంప్ దూకుడుగా పుంజుకున్నారు. ఎన్పీఆర్, ఓఆర్జీ సర్వేలో కూడా సర్వేలో కూడా స్వింగ్ స్టేట్స్ లో పెన్సిల్వేనియాలో పట్టు సాధించిన వారే వైట్‌హౌస్‌కు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇక్కడ నల్లజాతి ఓటర్లను ఆకట్టుకునేందుకు మాజీ అధ్యక్షుడు ఒబామాను కూడా డెమొక్రాటిక్ పార్టీ రంగంలోకి దింపింది.
అప్పట్లో కేవలం ఒక్కశాతం కంటే తక్కువ ఓట్లతో దీనిని ట్రంప్ గెలుచుకున్నారు. ఇక్కడ బొగ్గు, స్టీల్ పరిశ్రమల్లో పనిచేసే బ్లూకాలర్ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. అంతే కాదు ఇక్కడ ఓటర్లలో దాదాపు 84 శాతం మంది శ్వేతజాతీయులు. వీరిలో 54 శాతం మంది కళాశాల విద్యాభ్యాసం కూడా పూర్తి చేయని వారు ఉన్నారు. దీంతో వీరంతా ట్రంప్ పక్షానికి మళ్లారు. ముఖ్యంగా సబ్ అర్బన్ మహిళల్లో ట్రంప్‌కు ఆదరణ తగ్గినట్టు అంచనాలు వెలువడ్డాయి. దీంతో అక్టోబర్ 13న జాన్స్టౌన్ లో జరిగిన ఒక ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ ‘పట్టణ శివారు ప్రాంతాల్లోని మహిళలు మీరు నాకు దయచేసి ఓటు వేయండి’ అని కోరారు. ఆ సానుభూతి కూడా పనిచేసిందనే చెప్పకోవాలి. దీంతో పాటు బైడెన్ వస్తే బొగ్గు పరిశ్రమకు కష్టకాలం వస్తుందని ట్రంప్ చెప్పిన మాటలతో అక్కడి వారు ఏకీభవించారు. ఈ రాష్ట్రంలో జో బైడెన్‌కు 42.1 శాతం ఓట్లు లభించగా, ట్రంప్ కు 56.7 శాతం ఓట్లు లభించాయి.