వాషింగ్టన్ : అమెరికా ఎన్నికల్లో ఓటమి చవి చూసిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ మొదటికొచ్చారు. తన ఓటమిని దాదాపు అంగీకరించినట్టుగా నిన్న వ్యాఖ్యానించిన ఆయన తాజాగా తిరిగి పాతపాటే పాడారు. ఈ ఎన్నిక అక్రమమని (రిగ్డ్ ఎలెక్షన్) అని అన్నారు. నా ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదని, ఫేక్ న్యూస్ మీడియా దృష్టిలో ఆయన (జో బైడెన్) గెలిచారని ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో మేమే గెలుస్తాం అని కూడా చెప్పుకొచ్చారు. ఓటింగ్ లో రిగ్గింగ్ జరిగిందని, నేను పోరాడుతూనే ఉంటానని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ట్రంప్ కాంపెయిన్ అడ్వైజర్ అయిన జేసన్ మిల్లర్ కూడా తమ నాయకుడు ఓటమిని ఒప్పుకోవడం లేదని తెలిపారు. మీడియా మైండ్ సెట్ ని ఆయన ప్రస్తావిస్తున్నారని, ఎన్నిక సక్రమంగా ఉండాలన్నదే ఆయన ఉద్ధేశమని అన్నారు. ఓటింగ్‌లో జరిగిన అవకతవకలు, అక్రమాలను ఎక్స్ ప్లోజ్ చేస్తాం. డెమొక్రాట్ల రాజ్యాంగ విరుద్ధమని ఎలెక్షన్ మేనేజ్మెంట్ను రచ్ఛకీడుస్తాం అని మిల్లర్ గర్జించారు.
అయితే ట్రంప్ తీరుపై డెమొక్రాట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బైడెన్ ఘన విజయాన్ని తక్కవ చేసి చూపించడానికి, అమెరికా ఎన్నికల విధానంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లడానికే ట్రంప్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ట్రంప్ ఆరోపణలతో జరిగేదేమీ లేకపోయినప్పటికీ నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ ఏర్పాట్లకు అడ్డుతగిలినట్టవుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వెల్లడైన తుదిఫలితాల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. మరో వైపు బైడెన్ విజయాన్ని జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ఈ అమెరికా ఎన్నకిల్లో జోబైడెన్‌కు 306 ఎలక్టోరల్ ఓట్లు, ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయని ఈ నెల 13న అసోసియేషన్ ప్రెస్ , దాని అనుబంధ నెట్ వర్కులు పేర్కొన్నాయి. పైగా కోర్టుల్లో ట్రంప్ దాఖలు చేసిన దావాల వల్ల పెద్ద ప్రయోజనం లేదని మరో పుల్ల వేశాయి. ఇక వాషింగ్టన్ లో వేలాది ట్రంప్ మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా భారీ ర్యాలీ నిర్వహించడం విశేషం. బహుశా దీంతో ఆయన మళ్లీ నేనే విజత అనే పల్లవినెత్తుకున్నట్టు కనిపిస్తోంది.