TPCC: Break For TPCC Chief Post Announcement | Revanth Reddy Political Story|సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోన్న టిపిసిసి పోస్టు! Hyderabad: రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో ఎవరికీ అర్థం కాదు. కావా ల్సింది ఆశిస్తే, మరింక్కేదో వరిస్తుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో జాతీయ పార్టీలు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలం టూనే రేపు ఎవరు ఉంటారో, వెళ్లిపోతారోననే భయంతో ఏ నాయకుడు ఏం చేసినా చాలా ఆచీ తూచీ అడుగులు వేస్తూ వారిని బుజ్జగిస్తోంది. కొన్ని దశాబ్ధాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ నేడు ఆ సీటు గెలుస్తామో? లేదో? అనే డైలామాలోకి వెళ్లిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం రోజుకో పరిణామంతో వార్తల్లో నిలుస్తోంది. టిపిసిసి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులకు భంగం తప్పడం లేదు. ముఖ్యంగా ఎంపి రేవంత్ రెడ్డి విషయంలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ నేతలకు కూడా రుచించడం లేదనేది తెలుస్తోంది. ఇదిగో అదిగో అంటూ అప్పుడే ఉసూరుమనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రకటన ఖాయమంటూనే మరో సారి వాయిదా అంటూ వార్తల్లో చెబుతున్నారు.
రేవంత్ రెడ్డే కావాలంటున్న నాయకత్వం!
నేటి తరం రాజకీయాలలో ఉండాల్సిన నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన మాటలే తూటాలు. ఆయన అడుగులే నిర్ణయాలు. చెరగని చిరునవ్వులను వెంట పెట్టకుని రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నో భరిస్తున్నారు. ఎన్నో అనుభవిస్తున్నారు. రెండింటినీ సమానంగా ఎదుర్కొంటున్నారు. విజయానికి పొంగిపోవడం లేదు. అపజయానికి కుంగిపోవడం లేదు. నిం డైన కుండడగానే కనిపిస్తున్నారు. తొనకడం మాత్రం కనిపించడం లేదు. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ రేవంత్ రెడ్డిలో ఉన్నాయి. వీటన్నింటిని పరిశీలించిన ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు టిపిసిసి పదవి రేవంత్ రెడ్డికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న వైఎస్లోనూ, నిన్న జగన్‌లోనూ, నేడు రేవంత్ లోనూ ఇదే ధైర్యం, తెగువ, ఓపిక కనిపిస్తున్నాయి.
అడుగడుగునా సవాళ్లను ఎదుర్కొంటూ..!
రేవంత్ రెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి రాకముందు ఆర్ఎస్ఎస్ బ్యాంక్ గ్రౌండ్ ఉందని అంటుంటారు. తర్వాత టిఆర్ఎస్లో రాజకీయ ఓనమాలు నేర్చుకొని ఎదగాలని చేసిన ప్రయత్నం కుదరలేదు. దీంతో ఏకలవ్యుడిగా ఎదిగాడు. తన రాజకీయ చిత్రాన్ని తానే గీసుకున్నాడు. తన జీవితాన్ని తానే రాజకీయం చేసుకున్నాడు. ఇంతింతై వటుండింతై ఎదిగినట్టు రేవంత్ రెడ్డి ఎదిగారు. ప్రతిపక్షపాత్రలో ఇంత ఎత్తుకు ఎదిగిన నాయకుడు బహుశా దేశ రాజకీయాల్లో కొద్దిమందిలో రేవంత్ ఒకరు. అయితే ఎక్కడైతే ఎదగాలను కున్నారో ఆ పార్టీ తాను ఎదుగుతున్న క్రమంలోనే కనుమరుగైంది.
తెలంగాణ రాష్ట్రాం ఆవిర్భావంతో ఆ పార్టీ తెలంగాణ రాజకీయాలకు దూరమైంది. తెలంగాణలో చోటు లేకుండా పోయింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి తాను పెద్ద దిక్కునకున్నారు. అనుకోకుండా ఓటుకు నోటు కేసులో ఇరుక్కు న్నారు. తేరుకునే సరికి తెలంగాణలో కనుమరుగైన పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. ఆయన ఛరిస్మా మరింత పెంచుకునే ప్రయత్నమే చేశారు. కానీ అడుగడుగునా ఎదురవుతున్న సవాళ్లను పంటి కింద బిగపట్టి చిరునవ్వులు పులుముకుంటున్నారు. అహర్నీశలూ పార్టీ కోసం కృషి చేస్తున్నారు. అయినా ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయి.
ఆయనలో ఉన్న ఫైర్‌ను అర్థం చేసుకొని..!
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు అయ్యారు. ఆయన చెప్పిన కొంత మందికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆయనలో ఉన్న ఫైర్‌ను అర్థం చేసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన తన నియోజవర్గం కన్నా, పార్టీని గెలిపించాలన్న తపన ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీ చూసింది.ఆయన కసిని మెచ్చకుంది. ఓడిపోతే ఆదరిచింది. మళ్లీ ఎంపీ టిక్కెట్టు ఆఫర్ చేసింది. అనూహ్యంగా ఆయన గెలిచారు. మళ్లీ తలెత్తుకుని నిలబడ్డారు. అప్పటి నుంచి ఇక ఆయనే పిసిసి ప్రెసిడెంట్ అంటూ విస్తృత ప్రచారం మొదలైంది. పార్టీలో కూడా రేవంత్ రెడ్డి విషయంలో కదలికలు వచ్చాయి. ఇలాంటి ప్రచారం సాగుతున్న వేళ, వచ్చిన హుజూర్నగర్ ఉప ఎన్నిక రానే వచ్చింది. ఆ ఎన్నిక అయిపోయిన వెంటనే ఇక పిసిసి మార్పు తథ్యమనుకన్నారు. కానీ జరగలేదు.పిసిసి అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి ఉత్తమ్ పద్మ పోటీ చేసినా గెలవలేకపోయింది. ఇక పిసిసి పదవి అనివార్యమన్న ప్రచారంతో పాటు ఇక రేవంత్ రెడ్డి మెడలో కండువా పడ్డట్టే అనుకున్నారు. కానీ మళ్లీ వాయిదా పర్వమే కనిపించింది. ఇక ఇంతలో దుబ్బాక, ఆ తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు ఇలా ఏ ఎన్నికైనా ఏ ఇతర నాయకుడికంటే ఎక్కువ చొరవ చూపిస్తూ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.
టిపిసిసి పదవి విషయంలో వాయిదాల పర్వం!
రెండు నెలలుగా నాన్చుతున్న ప్రక్రియ పిసిసి నియామకం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్ రానే వచ్చారు. నాయకుల అభిప్రాయం సేకరణ చేపట్టారు. మొదట ఎంతో మంది గురించి వార్తలు వచ్చినప్పటికీ చివరకు ఇద్దరు నేతల మధ్యే ప్రధానమైన పోటీ అన్న సంకేతాలు పంపించారు. ఇంతలో సీనియర్ నాయకుడు విహెచ్. హనుమంతురావు ఒక్కసారిగా పార్టీలో ఉరుములు, మెరుపులు సృష్టించారు. రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా చేస్తే తాను పార్టీ మారతానని సంకేతాలు పంపారు. తర్వాత ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన పార్టీలో పార్టీలో పెద్ద దుమారాన్నే లేపింది. అప్పటిదాకా రేవంత్‌ను పక్కన పెట్టైనా వెంకటరెడ్డిని చేస్తే పార్టీలో బ్యాలెన్స్ చేసినట్టవుతుందని అనుకున్న అధిష్టానం ఆ నిర్ణయం నుంచి వెనక్కి మళ్లిందన్న వార్తలు వచ్చేశాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పిసిసి అధ్యక్షుడిని కాకుండా, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలే ఆయనను పక్కకు నెట్టేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.
లైన్ క్లియర్ అనుకుంటున్న వేళ..మళ్లీ బ్రేకులు!
ఇక రేవంత్ రెడ్డికి ఎదురేదన్న సంకేతాలు అందుతున్న తరుణంలో ఒక్కసారిగా సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. అంతకు ముందు రోజే తనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మద్దతు ప్రకటించినట్టే అన్నంత సంతోషంగా, సంగారెడ్డి ఎమ్మెల్యే కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నంతగా రేవంత్ రెడ్డి లో సంతోషం కనిపించింది. కానీ మరుసటి రోజే ఆ ఆనందం ఆవిరైంది. మీడియాలో వరుస కథనాలతో పాటు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలు కూడా జరుగుతున్న తరుణంలో జీవన్ రెడ్డి పేరు తెరమీదకు రాగానే తనకు పిసిసి అధ్యక్ష పదవి కన్నా, ప్రచార కమిటీ కన్వీనర్ పదవి చాలనట్టు, అదే తన స్వేచ్ఛకు, నాయకులను కలిసేందుకు దోహదపడుతుందన్న మాట రేవంత్ రెడ్డి చెప్పారు.
అంటే పరిపూర్ణమైన నేతగా ఎదిగే క్రమంలో ఓపిక ఎంతో అవసమరమన్న విశ్లేషకులు కూడా ఆయనను మెచ్చుకున్నారు. ఇంతలో మళ్లీ ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. పిసిసి అధ్యక్షుడు జీవన్ రెడ్డి అయినా, ముఖ్యమంత్రి అభ్యర్థి మాత్రం రేవంత్ రెడ్డి అంటూ ఓ ప్రచారం మొదలైంది. ఇది పూర్తిస్థాయిలో ప్రజలకు, నాయకులకు చేరకముందే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఓ బాంబు పేల్చారు. పిసిసి అధ్యక్ష ఎంపిక ప్రక్రియ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ఆపండంటూ అధిష్టానానికి లేఖ రాశారు. దీంతో కథ అడ్డం తిరిగినట్టైంది. ఇప్పుడు మళ్లీ బంతి అధిష్టానం కోర్టుకు చేరింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తానే సీఎం అని ప్రకటించుకునే జానారెడ్డి ఉత్తరాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది.
ఇది చదవండి: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి కొడాలి నాని
సేకరణ: నేటి ధాత్రి పత్రిక