New Year Celebrations Banned in Hyderabad|న్యూయర్ వేడుకలు: హైదరాబాద్‌లో ఆంక్షలు అమలుHyderabad: నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ఆంక్షలు అమలవుతాయని పోలీసు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 31న ఉదయం 11 గంటల నుంచి 2021 జనవరి 1 తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్‌టియూ, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్స్, దుర్గం చెరువు తీగల వంతెన మూసివేస్తున్నట్టు తెలిపింది. ఓఆర్ఆర్, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై కార్లు, జీపులకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
మరోవైపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్టు అధికారులు వెల్లడంచారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్క్, బీఆర్కే భవన్, తెలుగు తల్లి కూడలి, లిబర్టీ జంక్షన్, నల్లగుట్ట రైల్వే వద్ద వాహనాలను దారి మళ్లించనున్నట్టు పేర్కొన్నారు. తాజా ఆంక్షల నేపత్యంలో బేగంపేట ఫ్లైఓవర్ మినహా నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లైఓవర్లు రేపు రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు మూసివేస్తున్నారు. ఈ మేరకు ప్రజలు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంటి వద్దే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కఠినం
నూతన సంవత్సం మద్యం సేవించి వాహనాలను నడిపించే వారి పట్ల మరింత కఠినంగా ఉంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. కొత్త సంవత్సరం నుంచి సీసీ టీవీల సంఖ్యను 2.5 లక్షల వరకు పెంచుతామన్నారు. సైబర్ క్రైం నేరాల నివారణపై మరింత అవగాహన కల్పించి చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని, ప్రతి పోలీసు స్టేషన్ లో సైబర్ విభాగాలను ఏర్పాటు చేశామని సీపీ సజ్జనర్ అన్నారు. పోయిన నగదు రికవరీకి ప్రయత్నిస్తామన్నారు.
రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై 304 పార్ట్ -2 కింద అభియోగాలు మోపుతామని హెచ్చరించారు. బ్రిటన్‌తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను వివిధ శాఖల సమన్వయంతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో సైబర్ నేరాలు పెరిగాయని, వాటి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక నేరాలు పెరిగాయని, ఇప్పటికే సైబర్ నేరాల కేసులు ఎన్నో ఛేదించామని అన్నారు.
చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడంతో మహిళలపైనా, చిన్నారులపైనా జరిగే అఘాత్యాలు చాలా వరకు తగ్గాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ తప్పనిసరి చేయడంతో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు , మరణాలు తగ్గాయని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ 2020 వార్షిక నివేదికను సీపీ విడుదల చేశారు. కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, షీ టీమ్స్ డీసీపీ అనుసూయ, మాదాపూర్ ఇన్చార్జి డీసీపీ వెంకటేశ్వర్లు,ఎస్ సీఎస్ సీ ప్రధాన కార్యదర్శి కృష్ణతో పాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి : రౌడీ షీటర్ హత్య