Dubbaka MLA Raghunandan Rao questioned the government | కొమురవెల్లి మల్లన్నపై ఎందుకు ఇంత వివక్ష? | ఎమ్మెల్యే రఘునందన్‌రావుSiddipet: తెలంగాణ ముఖ్యమంత్రి కొమురవెల్లి మల్లన్న తీవ్ర అన్యాయం చేశారని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. ఆదివారం ఆయన సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్నను కుటుంబ సమేతంగా సందర్శించుకున్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ దేన్నైనా వంచిస్తాడని, ఇచ్చిన హామీలను మరిచిపోతారని ఇందుకు నిదర్శనం కొమురవెల్లి మల్లన్నే సాక్ష్యమని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ మొదటిసారి కొమురవెల్లి మల్లన్నను సందర్శిచారన్నారు. ఈ దేవస్థానాన్ని అంతర్జాతీయ స్థాయిలో రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.
దేవస్థానం అభివృద్ధికి రూ.70 కోట్ల నుంచి సుమారు రూ.100 కోట్లు ఇస్తామని అన్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఆ సమయంలోనే కొమురవెల్లి మల్లన్నను టెంపుల్ సిటీగా మార్చుతానని ముఖ్యమంత్రి మాట ఇచ్చారని గుర్తు చేశారు. మాట ఇవ్వడం దాన్ని మరచి పోవడం సీఎం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ప్రజలే కాదు, దేవుళ్లు కూడా అతీతం కాదని మల్లిఖార్జున స్వామి సాక్షిగా సీఎం కేసీఆర్ మాట తప్పారనేది తెలుస్తుందన్నారు.
సొంత జిల్లాపై ఇంత వివక్షా?
పారదర్శకతమైన టిఆర్ఎస్ పాలనలో, అవినీతి లేని పాలనలో కొమురవెల్లి మల్లన్న దేవస్థానానికి ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని ఏడేళ్లలో నియమించకపోవడం చేతకాని ప్రభుత్వ పనితీరును నిదర్శనమని ఆరోపించారు. దేవస్థానం బాగోగులు చూసేందుకు ఈవోలు ఉండరని, డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి అసలే ఉండరని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదాయంలో 7వ స్థానంలో కొమురవెల్లి మల్లన్న దేవాలయం ఉందని అన్నారు. అలాంటి ఈ దేవాలయం పట్ల ప్రభుత్వం సీతకన్ను వేసిందని, వివక్ష చూపుతోందని ఆరోపించారు.
సిద్ధిపేట స్వయానా ముఖ్యమంత్రి జిల్లా అని, కేసీఆర్ తలుచుకుంటే 5 నిమిషాల్లో పని పూర్తి అవుతుందని అన్నారు. ఇక్కడ జరుగుతున్న సంఘ విద్రోహ శక్తుల అరాచకాలను నిర్మూలించి, వెంటనే ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇది చదవండి: గృహ ప్రవేశం చేసిన తీన్మార్ మల్లన్న