Chandrababu Naidu apologized to the people | Paritala (Krishna) Latest news |క్షమించమని ప్రజలను కోరిన చంద్రబాబు నాయుడుParitala(Krishna) : జగన్ ఆడుతున్న నాటకాలు నమ్మి పూనకం వచ్చినట్టు ఓట్లేశారని, తానేం తప్పు చేశానో తనకు తెలీదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలనే తన తాపత్రయం అని, ఆ విధంగానే కృషి చేశానని చెప్పారు. అదే తాను చేసిన తప్పైతే తనను క్షమించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల లో ఏర్పాటు చేసిన సంక్రాంతి భోగి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రజా వ్యతిరేక జీఓ కాపీలను బోగి మంటల్లో వేసి దగ్థం చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో రైతులు ఎక్కడా ఆనందంగా లేరని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. రాష్ట్రంలో రైతు కూలీలు చితికిపోయారని విమర్శించారు. ప్రజా వ్యతిరేకతపై నిర్ణయాలు మీద నిర్ణయాలు కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 7 వరుస విపత్తులతో రైతులు నష్టపోతే ఎలాంటి పరిహారం ఇవ్వలేదని రైతుల్ని అసత్యాలతో దగా చేస్తున్నారని ఆరోపించారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా చెల్లించానని అడ్డంగా దొరికిన దొంగ అని వ్యాఖ్యానించారు.
పైశాచిక ఆనందం పొందుతున్న జగన్ :చంద్రబాబు
ప్రజావేతిక కూల్చి ఇంత వరకు శిథిలాలు తీయకుండా పైశాచిక ఆనందం పొందే శాడిస్టు జగన్ అని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక డెకాయిట్ మాదిరి వ్యవహరిస్తున్నారని అన్నారు. బెట్టింగ్ మంత్రులు, మైనింగ్ మాఫియా వాళ్లు, బూతులు మంత్రులు తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు బకాయిలు ఇంత వరకు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో మెగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పేదల రక్తం తాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు. రైతులకు మద్దతు ధర ఉండటంతో పాటు మార్కెట్ కమిటీలు కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. మీటర్లు వ్యవసాయ మోటర్లకు కాదు మంత్రులకు పెట్టాలని హెద్దేవా చేశారు.వైసీపీ మంత్రులకు మీటర్లు పెడితే ఏ మంత్రి ఎంత దోచుకుంటున్నారో రియల్ టైమ్‌లో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఫించన్లు పెంచుకుంటూ పోతానని మోసగిస్తున్నారన్నారు. అప్పుల కోసమే మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు.
అన్నింటిపైనా పన్నులే
పట్టణాల్లో అన్నింటిపైనా పన్నులే అని, పెంపుడు జంతువులపైనా పన్నులు విధిస్తున్నారని చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలి రెడ్డి కాబట్టి రేపోమాపో గాలిపైనా పన్ను వేస్తారని యెద్దేవా చేశారు. రాష్ట్రానికి రెండు కళ్లైన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారన్నారు. లక్షా 30 వేల కోట్ల అప్పులు, రూ.70 వేల కోట్ల పన్నులు మోపారని తెలిపారు. ప్రతి ఒక్కరిపై ఇప్పటికే రూ.70 వేలు భారం మోపారన్నారు. కుటుంబంలో నలుగురు ఉంటే రూ.2.80 లక్షల భారం పడిందని అన్నారు. ఈ భారం జీవితాంతం మోస్తూ ఊడిగం చేసే పరిస్థితి తెచ్చారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బోగి సంబరాల్లో పాల్గొన్న టిడిపి నాయకులు
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పరిటాలలో బోగి సంబురాల్లో చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. చిన్నారులను బోగీపల్లతో ఆశీర్వదించి, నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కేసినేని నాని, విజయవాడ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే , టిడిపి జాతీయ కోశాధికారి శ్రీరాం రాజ్‌గోపాల్ తాతయ్య, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తో పాటు తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.