AP Local body elections | the benefit of Chandrababu |Ambati Rambabu(YSRCP)చంద్రబాబుకు మేలు చేకూర్చడానికే ఎన్నికల కమిషనర్ ప్రయత్నాలు: అంబటిTadepalligudem: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా ప్రభావం ఉందని, వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చే సమయంలో ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో వందంటూ ప్రభుత్వం తరపున మంత్రులు, వైస్సాఆర్సీపీ నాయకులు మీడియా ఎదుట బలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై సీఎస్‌కు ఎన్నికల సంఘం శనివారం లేఖ రాసింది. ప్రవర్తనా నియామవళి కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని లేఖలో తెలిపింది. పట్టణ, నగర ప్రాంతాల్లో అమలులో ఉండదని చెప్పింది. పట్టణాల్లో సభలు పెట్టి గ్రామీణులకు లబ్ధి చేకూర్చే పనులు చేపట్టవద్దని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు అవుతుందని ఎస్ఈసీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది.
చంద్రబాబుకు మేలు చేయాలనే…:
అంబటి రాంబాబు
ఈ ఎన్నికల ప్రకటనతో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకు మేలు చేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చూస్తున్నారని వైస్సాఆర్ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని వైస్సాఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇలా చంద్రబాబు తొత్తుగా మారడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు జేబులో మనిషిలా, బంటులా, తొత్తులా, బానిసగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వ్యాక్సినేషన్ తర్వాత ఒకటి, రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తే చంద్రబాబుకు, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కలిగి నష్టం ఏమిటి? అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదనే భయంతో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. దీని ప్రభావమే స్థానిక ఎన్నికలపై ఉంటుందని చంద్రబాబు ఆందోళన చేస్తున్నారని హెద్దేవా చేశారు.
వైస్సార్ సీపీ అంఖడ మెజారీటి గెలుస్తోంది: అంబటి
రానున్న తిరుపతి ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ అఖండ మెజార్టీతో గెలవబోతుందని అందరూ భావిస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగు దేశం ఏ స్థానంలో ఉంటుందో కూడా అర్థం కాని స్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. కనీసం టిడిపి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి కనిపిస్తోందన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైతే, తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత ఎక్కువ ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారన్నారు. అందుకే కోవిడ్ రెండోదశ ఆందోళనలు ఉన్నా కూడా మొండిపట్టుతో, మూర్ఖంగా చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు షెడ్యూల్‌ను ప్రకటించారన్నారు.
ప్రజల ప్రాణాలకన్నా, ఎన్నికలే ముఖ్యమా?
పంచాయతీ ఎన్నికలు కన్నా, ప్రజల ప్రాణాలే ముఖ్యం కాదా? అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధమవుతున్న నేపథ్యంలో నిమ్మగడ్డ హఠాత్తుగా ఎన్నికల షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. కనీసం వ్యాక్సినేషన్ తర్వాత ఎన్నికలు జరపాలంటూ సీఎస్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిస్థితిని వివరించినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ దుర్మార్గంగా తిరస్కరించడం ఎంత వరకు సమంజసమని ఆరోపించారు. చంద్రబాబుకు మేలు చేయాలని, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెడతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు కోపం, కక్ష ఉంటే ఉండొచ్చని, కానీ రాజ్యాంగబద్ధంగా నడిచే ఎన్నికల కమిషన్‌కు ఆ కోపాలు, కక్షలు ఉండకూడదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు.
ఉద్యోగుల భద్రత ప్రమాదంలో …
వ్యాక్సినేషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారని అన్నారు.ఉద్యోగులు కూడా కోవిడ్ నుంచి రక్షణ కోరుకుంటున్నారన్నారు.వ్యాక్సిన్ ఇవ్వకుండానే వారిని విధులకు వెళ్లమంటే తర్వాత వారు కోవిడ్ బారిన పడితే, ఎవరైనా మరణిస్తే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ దానికి బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.
జగన్ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే…
18 నెలల పరిపాలనలో సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సెక్రటేరియేట్, గ్రామ వాలంటీర్లు వచ్చిన తర్వాత 1వ తేదీన సూరోద్యం కాకముందే పెన్షన్లు అందుతున్నాయన్నారు. చేతికి వస్తున్న 31 లక్షల ఇళ్ల పట్టాలు, 45 లక్షల మందిని బడికి పిల్లల్ని పంపే తల్లులకు అందబోతున్న రెండో విడత అమ్మఒడి వీటితో పాటు ఆసరా చేయూత, విద్యా దీవెన, విద్యా కానుక, గోరు ముద్ద వంటి పథకాల వల్ల ప్రజలకు కలుగుతున్న లబ్ధిని చూసి ఓర్వలేక పోతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఇక ఎలాగూ ఏపీలో తమకు స్థానం లేదన్న ఆలోచనతో మళ్లీ కోవిడ్ ను ఒక్కసారిగా పెంచాలన్న కుట్రపూరిత బుద్ధితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఎన్నికల నోటిఫికేషన్ తీసుకొచ్చినట్టు అనుమానం కలుగుతుందన్నారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ను పెద్ద స్థాయిలో ఉద్యోగం చేస్తోన్న చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వంటి బాధ్యత కలిగిన ఉద్యోగులు వద్దంటుంటే ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు.
ఇది చదవండి: మా అక్కను ఇబ్బంది పెడుతున్నారు! జాగ్రత్తా!